Monday 21 April 2014

వచ్చిపో చెలీ!

 ఒక్కసారి వచ్చిపో చెలీ!
చిరునవ్వులు ఇచ్చిపో నిచ్చెలీ!!

కన్నీటి వానలో తడిసి ముద్దవుతున్నా 
నీ వలపు గొడుగు పట్టలేవా?
శోకమనే ఎడారిలో కొట్టుమిట్టాడుతున్నా 
నీ చిరునవ్వులతో ఈ దాహార్తి తీర్చలేవా?
   
నీ చెలిమి లో చింతలనేవే నా చెంతకు రాలేదు
నీ కలిమిలో కలతనేవే నా దరికి చేరలేదు

భయమే బెదిరిపోయి పారిపోయింది
నువ్వు నా తోడున్నావని భయపడిపోయి
విజయాలన్నీ నా కైవసం అంటూ తలవంచాయి
నువ్వు నాకిచ్చిన ప్రోత్సాహానికి మురిసిపోయి

నీతో గడిచిన ప్రతీ క్షణం మధురాతి మధురం
నీతో నడిచిన నడక  నల్లేరుపై బండి నడక
నా జీవితం ఒక పుస్తకమైతే
ఆనందంతో నిండిన ప్రతీ పుటలో నువ్వే నువ్వే

నువ్వు లేని నేడు
ఆనందం ఒక్క పరికైనా వచ్చిపోనంది
కన్నీరయినా నా తోడేమోననుకుంటే
నువ్వు లేని నన్ను చూసి తట్టుకోలేనంటూ వెళ్ళిపోయింది
నా గొంతు ఈ కవిత కూడా
పలుకలేనంటూ మూగబోయింది
  
ఏ తోడూ లేని నా మనసు ఇంతటి క్షోభను
భరించలేనంటూ చచ్చిపోతుంది 
చుక్కల్లోని వెలుగంతా నా కన్నుల్లోకి చేరింది 
వెన్నెలలోని చలువంతా నా గుండెల్లోకి చేరింది 

కొమ్మల్లోని కుకూలన్నీ
పెదవులపై పల్లవులైనాయి 
మనసులోని పదాలన్నీ
కాగితాలపై కవితలైనాయి 

నిదురపొతున్న నా మనసు లేచి 
హాయి రాగాలెన్నో మీటగా 
కనులు కన్న నా కలలు రెప్పలు దాటి 
కన్నుల ముందు కనువిందు చేయగా 

ఆకాసానికి ఎగిసిపడే మనసునాపలేక 
తలపులలోని నిను తలుపులేసి బంధించలేక 
నిన్నే పూర్తిగా నింపుకున్న నా ఎద బరువు మోయలేక 
తెలపాలనుకున్నా కానీ తడబడుతున్నా 

నేస్తమా  తెలుసుకో 
ప్రియతమా అంటూ నను చేరుకో   
నీ కలువ కళ్ళ లోతుల్లో మునిగిపోయాను 
నీ చిరునవ్వుల అలజడిలో నను నేనే మరిచిపోయాను 
నీ వాలుజడను చూసి మైమరిచి పోయాను
నీ తలపుల తాకిడికి నను నేను కోల్పోయాను 
నిను మాత్రమే నిలుపుకున్నాను  
నీ 
    మది నిండుగా మంచితనం 
    అచ్చమైన తెలుగమ్మాయితనం 
    చిలిపి చేష్టల గడుసుతనం 
భాష రాని నాతో ఇన్ని భావాలు పలికిస్తున్నాయి 
పదములెరుగని నాతో కవితలల్లిస్తున్నాయి 
రాగమెరుగని నాతో పాటలు పాడిస్తున్నాయి