Saturday 18 February 2012

నేనెందుకు వేరైపోతిని మరి?

నిన్ను మోసే  నేలే నన్నూ  మోస్తోందే
నేను  అర్హుడను  కాను  అని నన్ను ఎక్కడ పారేయలేదే?
గలగలా పారే గంగమ్మ నా దాహమూ తీర్చిందే
నేనసలు మనిషినే కానని నాకసలు దాహమే ఉండదని
నన్ను నీవు తాకవద్దని ఏనాడు అనలేదే?
నీవు పీల్చే గాలే నాకూ జీవం పోస్తోందే 
నాకసలు ప్రాణమే ఉండదనీ
నేను నీ లోనికి రాలేనని నన్నెన్నడూ వదలలేదే?
నా నీడకి నువ్వు రావొద్దని,
నా పండ్లను నీవు తినవద్దని 
నా పూలను నీవు కోయవద్దని,
ఆ చెట్టయినా నన్నెపుడూ వేరుచేయలేదే?


నిను తడిపిన ఆ మేఘం నా వద్ద ఆగిపోలేదే?
నీలోన ప్రవహించే అదే రక్తం నాలోన  లేదా?
నీకున్న ఆ హృదయం నాకంటూ లేదా?
నీలోని పరమాత్మ నాలోనూ ఉంటే
నేనెందుకు వేరైపోతిని మరి?
పంచభూతాలకు లేని పక్షపాతం మనకెందుకయా?
నీదే జాతని నాదే మతమని ఎందుకయా?